
India Versus South Africa 2025: రోజంతా నిలుస్తారా
Last updated by: Rayhaan Shareef
Last updated at: Nov 28, 2025, 09:11 AM
గువాహటి: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియాకు భారీ ఓటమి తప్పేలా లేదు. ఇక జట్టు పోరాటమంతా డ్రా కోసమే. భారత బ్యాటర్లు బేలగా మారిన పిచ్‌పై నాలుగో రోజున దక్షిణాఫ్రికా మాత్రం అదరగొట్టింది. ప్రత్యర్థిని ఫాలోఆన్ ఆడించకుండా బరిలోకి దిగిన సఫారీలు తమ రెండో ఇన్నింగ్స్‌ను 260/5 స్కోరు వద్ద డిక్లేర్ చేశారు. దీంతో ఆ జట్టుకు 548 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. స్టబ్స్ (94) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. డి జోర్జి (49), రికెల్టన్ (35), ముల్డర్ (35 నాటౌట్) మార్‌క్రమ్ (29) రాణించారు. స్పిన్నర్ జడేజాకు నాలుగు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత 549 పరుగుల ఛేదనలో భారత్ మంగళవారం ఆట ముగిసే సమయానికి 15.5 ఓవర్లలో 27/2 స్కోరుతో నిలిచింది. జైస్వాల్ (13), రాహుల్ (6) నిరాశపర్చారు. క్రీజులో ఉన్న కుల్దీప్ (4 బ్యాటింగ్), సుదర్శన్ (2 బ్యాటింగ్) పరుగులు తీసేందుకు చెమటోడ్చుతున్నారు. విజయం కోసం భారత్ మరో 522 పరుగు లు చేయాల్సి ఉండగా, ఆఖరి రోజును అజేయంగా ముగించి డ్రా చేసుకోగలుగుతారా? అనేది వేచిచూడాల్సిందే