
ఎన్నికల విధులలో నిర్లక్ష్యం వహిస్తే కఠినమైన చర్యలు - ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPS
Last updated by: Deepak
Last updated at: Nov 29, 2025, 08:00 AM
పత్రికా ప్రకటన తేది: 28.11.2025 జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోండి. ఎన్నికల విధులలో నిర్లక్ష్యం వహిస్తే కఠినమైన చర్యలు. నిర్భయంగా, ప్రశాంతంగా ఎన్నికలు జరిగే విధంగా, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPS గారి దిశానిర్దేశం. జిల్లాలో ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPS గారు ఈరోజు జిల్లాలోని పోలీస్ అధికారులతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో మూడు దశల్లో జరగనున్న ఎన్నికల ప్రక్రియ, భద్రతా ఏర్పాట్లు మరియు బందోబస్తుపై అధికారులకు ఆమె స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. జిల్లా వ్యాప్తంగా 582 గ్రామాలలోని 608 పోలింగ్ లొకేషన్ లలో ఉన్న 4956 పోలింగ్ స్టేషన్ లలో ఎన్నికలు జరుగుతాయి అని, ఈ ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం పూర్తి సన్నద్ధతతో ఉండాలని ఎస్పీ గారు సూచించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున,నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, ఉల్లంఘనలకు పాల్పడే వారిపై తక్షణమే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారు ఆదేశించారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, డబ్బు రవాణా జరిగే ఆస్కారం ఉన్నందున తనిఖీలను ముమ్మరం చేయాలన్నారు. ముఖ్యంగా ఎస్.ఎస్.టి (SST) మరియు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా సమస్యాత్మక పోలింగ్ లొకేషన్లను ముందుగానే గుర్తించి, అక్కడ అదనపు బలగాలను మోహరించాలని, నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. జిల్లాలో శాంతికి విఘాతం కలిగించే పాత నేరస్తులు, రౌడీ షీటర్లు, ఎలక్షన్ సస్పెక్ట్స్ మరియు అనుమానితులను గుర్తించి వారిని ముందుగానే బైండోవర్ చేయాలని ఆదేశించారు. అలాగే, గన్ లైసెన్స్ కలిగిన వ్యక్తుల నుండి వెంటనే ఆయుధాలను డిపాజిట్ చేసుకోవాలని స్పష్టం చేశారు. పోలీస్ అధికారులు తమ స్టేషన్ పరిధిలోని ప్రతి పోలింగ్ లొకేషన్‌ను స్వయంగా సందర్శించి భద్రతా పరమైన లోపాలు లేకుండా చూసుకోవాలని తెలిపారు. ఎన్నికల విధుల పట్ల అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని, విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ గారు హెచ్చరించారు. పోలింగ్ సిబ్బందితో మరియు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో పోలీస్ అధికారులు నిరంతరం సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ప్రజలు ఎటువంటి భయం లేకుండా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా భరోసా కల్పించడమే పోలీస్ శాఖ అంతిమ లక్ష్యమని ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా స్పష్టం చేశారు. ఇట్టి కార్యక్రమం లో జిల్లా అదనపు ఎస్పీ బి.రాములు నాయక్ గారు, డిటిసి డిఎస్‌పి శ్రీనివాస్ గారు, వికారాబాద్ డిఎస్‌పి శ్రీనివాస్ రెడ్డి గారు, తాండూర్ డిఎస్‌పి ఎన్.యాదయ్య గారు, పరిగి డిఎస్‌పి శ్రీనివాస్ గారు,జిల్లా లోని పోలీస్ అధికారులు,సిబ్బంది పాల్గొనడం జరిగింది.