
Super Wood: సూపర్ వుడ్.. ఉక్కును మించిన చెక్క
Last updated by: Rayhaan Shareef
Last updated at: Nov 28, 2025, 06:54 PM
న్యూయార్క్, నవంబరు 25: ఉక్కు అంటేనే శక్తికి, గట్టిదనానికి ప్రతీక! అలాంటి ఉక్కు కన్నా శక్తిమంతమైన.. అల్యూమినియం కన్నా తేలికైన, పర్యావరణహితమైన చెక్క ఆధారిత ఉత్పత్తిని అమెరికాలోని మేరీల్యాండ్ వర్సిటీ శాస్త్రజ్ఞులు అభివృద్ధి చేశారు. ప్రకృతి సిద్ధమైన సాధారణ చెక్కనే రసాయన, యాంత్రిక మార్పులకు గురిచేయడం ద్వారా దాన్ని వారు కొన్ని పారిశ్రామిక లోహాల కన్నా మరింత బలంగా, దృఢంగా.. ఒక్క మాటలో చెప్పాలంటే ‘సూపర్ వుడ్’గా మార్చగలిగారు. ఉక్కు బరువుతో పోలిస్తే ఆ చెక్క బరువు ఆరోవంతే! కానీ.. శక్తి మాత్రం ఉక్కుకన్నా 10 రెట్లు ఎక్కువ. సహజంగా భూమిలో కలిసిపోయే పదార్థం కావడంతో పర్యావరణానికి హానికరం కాదు. సూపర్‌వుడ్ తయారీలో భాగంగా తొలుత మామూలు చెక్కను తీసుకుని దానిలోని కొన్ని ముఖ్యమైన భాగాలను ముందుగా తొలగిస్తారు. చెక్కలో ముఖ్యమైన భాగాలు.. సెల్యులోజ్, హెమీసెల్యులోజ్, లిగ్నిన్. వీటిలో లిగ్నిన్.. చెక్కకు గోధుమ రంగును, గట్టిదనాన్ని ఇస్తుంది. ఈ మూడింటిలో.. లిగ్నిన్‌ను ఎక్కువగా, హెమీసెల్యులోజ్‌ను కొంతమేర తొలగిస్తారు. దీంతో చెక్క మృదువుగా తయారవుతుంది. అనంతరం అధిక ఒత్తిడి, ఎక్కువ ఉష్ణోగ్రత ఉపయోగించి ఆ చెక్కను కంప్రెస్ చేస్తారు. దీంతో చెక్కలో ఉండే సూక్ష్మతంతువులన్నీ ఒకదానికొకటి అతుక్కుపోయేంత దగ్గరగా జరిగి ఆ చెక్క అత్యధిక సాంద్రత కలిగిన బ్లాకుగా మారుతుంది. అదే పరిమాణంలో ఉన్న చెక్కతో పోలిస్తే.. ఈ సూపర్ వుడ్ దృఢత్వం 3 నుంచి 10 రెట్లు ఎక్కువగా, ఉక్కుతో సమానంగా లేదా అంతకు మించి ఉంటుందని మేరీల్యాండ్ వర్సిటీ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అదే సమయంలో.. ఈ చెక్క బరువు ఆయా లోహాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉండడం గమనార్హం. ఇక.. సాధారణ చెక్క కంప్రెసివ్ స్ట్రెంత్ (అంటే చెక్కను ఎంత గట్టిగా నొక్కితే అది విరుగుతుందో తెలిపే బలం).. 35 ఎంపీఏ(మెగాపాస్కల్)గా ఉంటుంది. కానీ ఈ సూపర్‌వుడ్ కంప్రెసివ్ బలం ఏకంగా 160 ఎంపీఏ. కాగా.. ఈ పరిశోధన ప్రయోగశాలలకే పరిమితం కాలేదు. ‘ఇన్వెంట్‌వుడ్’ అనే కంపెనీని ప్రత్యేకంగా స్థాపించి.. ఈ సూపర్ వుడ్‌ను వాణిజ్యస్థాయిలో ఉత్పత్తి చేయడం ప్రారంభించారు.